17, ఆగస్టు 2026, సోమవారం
KVR BRAND
KVR BRAND

చైతన్యమే లక్ష్యంగా kvrbrand.com

హక్కులకై అడుగేయ్ ... వాస్తవాలు అడిగేయ్!

KKVR Admin17 ఆగ, 2026 1:53 AM0
చైతన్యమే లక్ష్యంగా kvrbrand.com

కాండ్రేగుల వెంకటరమణ

"ఎవరో వస్తారని, ఏదో చేస్తారని... ఎదురు చూసి మోసపోకుమా... నిజం మరచి నిదురపోకుమా" - మహాకవి శ్రీశ్రీ

అవును ... మన కోసం ఎవరూ రారు. మనం అంటే ‘జనం’. సామాన్య జనం. గొప్పోళ్లు, మోతుబరులు, నాయకుల మీద ఆధారపడకుండా ఎవరికి వారు సంపూర్ణ విషయ పరిజ్ఞానం, అవగాహన పొందడం ద్వారా తమ సమస్యలను ఎవరికి వారే పరిష్కరించుకోవచ్చు. అందుకు ఇప్పటి వరకు జనం జన చైతన్య మాస పత్రిక అండగా నిలిచింది. ఇకపై https://kvrbrand.com వెబ్‌సైట్ కూడా మీకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. కళ్లెదుటే మోసాలు, అక్రమాలు, నిర్లక్ష్యం జరుగుతున్నా ‘మనకెందుకులే’ అనే ఉదాసీనతకు స్వస్తి పలికి, సమస్యను గుర్తించి పరిష్కారం కోసం కార్యాచరణకు దిగడమే ఈ వెబ్‌సైట్ ప్రధాన లక్ష్యం.

సమాచార హక్కు, వినియోగదారుల రక్షణ, ఆహార భద్రత, విజిల్‌బ్లోయర్స్‌ రక్షణ, మానవ హక్కులు మొదలగు ప్రజా ప్రయోజన చట్టాలు, సిటిజన్‌ చార్టర్లు, ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, సామాజిక సమస్యలు-పరిష్కార మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే https://kvrbrand.com అభిమతం. ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలకు కేవలం సమస్యను చూపించడం కాకుండా.. పరిష్కారం దిశగా నడిపించే సమాచారాన్ని అందించడమే వెబ్‌సైట్ ప్రత్యేకత. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం అందక ఇబ్బంది పడుతున్నప్రజలకు, వస్తువులు కొనుగోలు చేసి లేదా సేవలు పొందుతూ నష్టపోయిన వినియోగదారులకు, సిటిజన్‌ చార్టర్ల ప్రకారం నిర్ణీత గడువులో సేవలు అందని వాళ్లకు, సంక్షేమ పథకాల అర్హతలు తెలియక సందిగ్ధంలో ఉన్నసామాన్యులకు అవసరమైన మార్గదర్శక సమాచారాన్ని అందించేందుకు వెబ్‌సైట్ కృషి చేయనుంది. ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకాన్ని వెన్నుతట్టి, వాటిని అధిగమించేలా చేయూతనివ్వడం, చైతన్యాన్ని పురిగొల్పడమే మా కర్తవ్యం. ఈ బృహత్ కార్యంలో kvrbrand.com నిత్య నూతనంగా... సత్య కేతనంగా ప్రజలకు అండగా ఉంటుంది.

అవినీతిపై బ్రహ్మాస్త్రం .. సమాచార హక్కు

‘డబ్బు మాది... లెక్కలూ మాకే’ అంటూ రాజస్థాన్‌లోని ఓ పల్లెలో పురుడు పోసుకొన్న ఆందోళన దేశవ్యాప్తంగా ఎగబాకి ఆర్టీఐ చట్టానికి ప్రాణ ప్రతిష్ట చేసింది. 1947 ఆగస్టు 15న దేశానికి రాజకీయ స్వాతంత్య్రం లభిస్తే, 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడంతో ప్రజలకు ప్రభుత్వ వ్యవహారాలను ప్రశ్నించే శక్తి మరింత బలపడింది. నాటి నుంచి ఎన్నో అవినీతి భాగోతాలు ఈ చట్టం ద్వారా వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రతి పౌరునికి ఉంది. ప్రశ్నించడం పౌరుని హక్కు. అభివృద్ధి కార్యక్రమాలు, ఖర్చులు, సంక్షేమ పథకాల పూర్తి సమాచారం అడిగి తెలుసుకోవచ్చు. దీనివల్ల పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఏర్పడి అధికార యంత్రాంగంలో నిర్లక్ష్యం తగ్గుముఖం పడుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో రూపొందే, భద్రపరిచే ప్రజా సమాచారం ప్రజల ప్రయోజనానికే కాబట్టి దాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది.

 వినియోగదారుడే రారాజు ... కొత్త చట్టంతో మరింత ధీమా

వ్యాపార సంస్కృతి విస్తరించడం వల్ల దోపిడీ ఎక్కువైంది. 'ముందు దగా ... వెనుక కుట్రగా' మారిన వ్యవస్థను అరికట్టడానికి, రక్షణ కల్పించేందుకు 1986లో వచ్చిన చట్టానికి మార్పులు, చేర్పులు చేసి 2020లో కొత్త వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. గతంలో మోసాలకు గురైనా పట్టించుకున్న నాధుడు లేకపోవడంతో వ్యాపారులకు ‘ఆడింది ఆటగా పాడింది పాట’గా సాగింది. నేడు 'వినియోగదారుల కమిషన్ల' పుణ్యమా అని బాధితులకు ఈ చట్టం దన్నుగా నిలబడింది. మాతృగర్భంలో పిండం తయారు కావడం మొదలు, చనిపోయేంత వరకు ప్రతి ఒక్కరూ వినియోగదారులే! వస్తు సేవల్లో ఏదైనా సమస్య ఎదురైనపుడు పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి, ఏ విధంగా పరిష్కారం పొందాలి అనే అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా వినియోగదారుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు https://kvrbrand.com వెబ్‌సైట్ దోహదపడనుంది.మీ

ఇదొక చట్టబద్ధమైన ప్రజా ఉద్యమం

కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన అవినీతి, నిర్లక్ష్యం పొరలను తొలగించడానికి చట్టబద్దంగా సాగే ఉద్యమం ఇది. ఇందుకోసం ఆర్టీఐ, వినియోగదారుల రక్షణ చట్టాలు, సంక్షేమ పథకాల సమాచారంను డిజిటల్ వేదికగా విస్తృత సమాచారాన్ని అందించేందుకు వెబ్‌సైట్ ముందుకు సాగనుంది. హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించండి. నిరాధారమైన విమర్శలు తగ్గించి సమస్య పరిష్కారానికి కృషి చేయండి. అడగండి. అడిగి తెలుసుకోండి. తెలిసి నిర్ణయించుకోండి. మీ నిర్ణయాలే దేశ భవితను నిర్దేశిస్తాయి. ఈ ప్రజా ఉద్యమానికి బాధ్యతగల పౌరులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, కొంతమంది అధికారులు, ఇంకా ఎంతో మంది ఆత్మీయులు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆ స్ఫూర్తితోనే ఈ వెబ్‌సైట్ నిర్వహించడం జరుగుతోంది. హక్కులను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ... బాధ్యతలను గుర్తించడం కూడా అంతే ముఖ్యం. నిరాధారమైన విమర్శలకు దూరంగా ఉండి, సమస్య పరిష్కారానికి అవసరమైన సమాచారం, ఆధారాలు, చట్టబద్ధమైన మార్గాలను అన్వేషించాలి. ప్రజా ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న https://kvrbrand.com వెబ్‌సైట్ పురోగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలి. ఆశావహంగా అడిగేస్తే ... ఆచరణతో అడుగేస్తే... అందనిదేదీ ఉండదు!  ప్రజలే బలం.. ప్రజా చైతన్యమే ఆయుధం.

చివరిగా ఒక మాట .. జనం సాక్షిగా https://kvrbrand.com వెబ్‌సైట్‌లో అంతా ‘నిజం’ ఉంటుంది, అబద్ధం ఉండదు. సమాజ మార్పుకై మీరూ భాగస్వాములు కండి ... ప్రజా ప్రయోజనానికే అంకితం !