- కాండ్రేగుల వెంకటరమణ
విద్యుత్ సర్వీసు కనెక్షన్ల మంజూరులో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ‘విద్యుత్ సదుపాయం పొందడం అనేది జీవించే హక్కులో ఒక అవిభాజ్య అంతర్భాగమని’, దానికి విఘాతం కలిగిస్తే ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. సరైన కారణాలు చూపకుండానే సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా విద్యుత్ కనెక్షన్ దరఖాస్తులను తిరస్కరిస్తున్న అధికారుల తీరును తప్పుబడుతూ ఇంధనశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే ...?
శ్రీకాకుళం జిల్లా పరంపేటకు చెందిన కడగల శ్రీనివాసరావు తన ఇంట్లో జీవనోపాధి కోసం ఓ చిన్న పిండి గిర్నీ (మిల్లు) ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి ఎనఓసీ (నిరభ్యంతర పత్రం) తీసుకుని, తగిన ఫీజు చెల్లించి కేటగిరి-2 కింద కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం 2025 సెప్టెంబర్ 20న ఏపీఈపీడీసీఎల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే, అక్టోబర్ 10న మీటరు బిగించేందుకు వచ్చిన విద్యుత్ సిబ్బంది ... స్థానికుల అభ్యంతరాల సాకుతో కనెక్షన్ ఇవ్వకుండానే వెనుదిరిగారు. ఎందుకు కనెక్షన్ ఇవ్వలేదో కూడా దరఖాస్తుదారునికి కనీస సమాచారం ఇవ్వలేదు. పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోగా, ఆన్‌లైన్ పోర్టల్‌లో మాత్రం దరఖాస్తును ‘శాశ్వతంగా తిరస్కరించినట్లు’ చూపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై విసిగి వేసారిన బాధితుడు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ కుంచం మహేశ్వరరావు ... పిటిషనర్ దరఖాస్తును శాశ్వతంగా తిరస్కరిస్తూ ఈపీడీసీఎల్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను తక్షణమే రద్దు చేస్తూ 2026 జూన్ 22 రిట్ పిటీషన్ నెం. 8103/2026లో తీర్పు వెలువరించారు. విద్యుత్ కనెక్షన్ల వ్యవస్థను క్రమబద్ధీకరించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంధనశాఖకు పలు సూచనలు చేశారు.
రెండు వారాల్లో కనెక్షన్ : పిటిషనర్ పెట్టుకున్న దరఖాస్తును తిరిగి పరిగణనలోకి తీసుకుని, విద్యుత్ చట్టం, 2003 లోని సెక్షన్ 43 ప్రకారం ... ఏవైనా అవసరమైన ఛార్జీలు ఉంటే వాటిని వసూలు చేసి, తగిన రుసుము వసూలు చేసి ఈ తీర్పు కాపీ అందిన రెండు వారాల్లోగా పిటిషనర్ దరఖాస్తును తిరిగి పరిశీలించి కనెక్షన్ మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
కారణాలు చెప్పాల్సిందే : స్పష్టమైన కారణాలు తెలపకుండా విద్యుత్ కనెక్షన్ కోసం ప్రజలు పెట్టుకునే దరఖాస్తులను శాశ్వతంగా తిరస్కరించడం ఏమాత్రం సరికాదని కోర్టు తేల్చిచెప్పింది.
నివేదికలు తెప్పించుకోండి : రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలన్నీ ఇకపై సర్వీస్ కనెక్షన్ల దరఖాస్తులు ఎప్పుడు వచ్చాయి ? ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? తుది ఫలితం ఏమిటి ? తదితర వివరాలను డిస్కంలు నుంచి రప్పించుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలని ఇంధన శాఖను కోర్టు ఆదేశించింది. అందుకు అనుగుణంగా విద్యుత్ చట్టం-2003, భారత రాజ్యాంగ లక్ష్యాలు సక్రమంగా అమలయ్యేలా అధికారులకు తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.
ప్రాథమిక హక్కు : ప్రజల దైనందిన జీవితం విద్యుత్‌తో ముడిపడి ఉన్నందున ... విద్యుత్ సదుపాయం ఉండటం భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని, ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు సైతం పేర్కొందని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది.
అదే విధంగా విద్యుత్ పంపిణీ సంస్ధల పరిధిలోని విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక (సీజీఆరఎఫ్)లు కనెక్షన్లమంజూరుకు సంబంధించి ఇచ్చిన తీర్పులను సైతం రాష్ట్రంలోని కొంతమంది విద్యుత్ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ఇలాంటి వాటిపై కూడా విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శి సమీక్షించాలి. ఇకనైనా అధికారులు మెరుగైన సేవలందించాలి.
ఆర్టీఐ ద్వారా తెలుసుకోవచ్చు : తీర్పు అమలుపై తీసుకున్న చర్యలు, నివేదికలు కాపీలను సామాజిక కార్యకర్తలు ఆర్టీఐ దరఖాస్తులు సంధించడం ద్వారా పురోగతిని తెలుసుకోవచ్చు.







