19, ఆగస్టు 2026, బుధవారం
KVR BRAND
KVR BRAND

కరెంట్ కనెక్షన్ పొందడం ప్రాథమిక హక్కు నిరాకరిస్తే తప్పదు చిక్కు!హైకోర్టు సంచలనాత్మక తీర్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు రిట్ పిటీషన్ నెం. 8103/2026లో వెలువడిన తీర్పు ... కండకావరంతో వ్యవహరిస్తూ కొత్త కరెంటు కనెక్షన్ల మంజూరులో ఇష్టారాజ్యంగా చెలరేగుతున్న కొంతమంది విద్యుత్ అధికారుల అహంకారంపై కొరడా ఝళిపించినట్లైంది. విద్యుత్ సదుపాయం అనేది భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని, దాన్ని నిరాకరించడం అంటే ప్రజల జీవించే హక్కును ఉద్దేశపూర్వకంగా కాలరాయడమేనని తీర్పులో న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. కనీస కారణం చెప్పకుండా, అడ్డగోలు సాకులతో విద్యుత్ కనక్షన్ దరఖాస్తును ఏకపక్షంగా ‘శాశ్వతంగా తిరస్కరించడం’ డిస్కం అధికారుల బరితెగింపునకు, బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట నిలుస్తుంది. ఇలాంటి దిక్కుమాలిన పోకడలను తక్షణం విడనాడాలని, రద్దు చేసిన ఆ చెత్త ప్రొసీడింగ్స్ పక్కనపెట్టి పిటిషనర్‌కు రెండు వారాల్లోగా కనెక్షన్ ఇచ్చి తీరాలని, అధికారులకు చెంపచెల్లుమనిపించేలా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందని పబ్లిక్ ఫోరం వాఖ్యానించింది. ఇకపై దరఖాస్తులను ఎందుకు తిరస్కరిస్తున్నారో స్పష్టమైన కారణాలు చెప్పాల్సిందేనని, సర్వీసు కనెక్షన్ల జారీపై డిస్కంల నుంచి ప్రతి మూడు నెలలకోసారి నివేదికలు రూపొందించాలి. ఖచ్చితత్వం లేని నిబంధనల పేరుతో ముప్పుతిప్పలు పెట్టి ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తే అధికారుల తోలుతీస్తామన్న రేంజ్‌లో హైకోర్టు తీర్పు ఉంది ... నిర్లక్ష్యపు నిద్రలో ఉన్న కొంతమంది విద్యుత్ అధికారుల్లో ఈ తీర్పు గుబులు పుట్టిస్తోంది.

KKVR Admin19 ఆగ, 2026 12:15 AM0
కరెంట్ కనెక్షన్ పొందడం ప్రాథమిక హక్కు నిరాకరిస్తే తప్పదు చిక్కు!హైకోర్టు సంచలనాత్మక తీర్పు

- కాండ్రేగుల వెంకటరమణ

                విద్యుత్ సర్వీసు కనెక్షన్ల మంజూరులో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ‘విద్యుత్ సదుపాయం పొందడం అనేది జీవించే హక్కులో ఒక అవిభాజ్య అంతర్భాగమని’, దానికి విఘాతం కలిగిస్తే ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. సరైన కారణాలు చూపకుండానే సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా విద్యుత్ కనెక్షన్ దరఖాస్తులను తిరస్కరిస్తున్న అధికారుల తీరును తప్పుబడుతూ ఇంధనశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే ...?

శ్రీకాకుళం జిల్లా పరంపేటకు చెందిన కడగల శ్రీనివాసరావు తన ఇంట్లో జీవనోపాధి కోసం ఓ చిన్న పిండి గిర్నీ  (మిల్లు) ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి ఎనఓసీ (నిరభ్యంతర పత్రం) తీసుకుని, తగిన ఫీజు చెల్లించి కేటగిరి-2 కింద కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం 2025 సెప్టెంబర్ 20న ఏపీఈపీడీసీఎల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే, అక్టోబర్ 10న మీటరు బిగించేందుకు వచ్చిన విద్యుత్ సిబ్బంది ... స్థానికుల అభ్యంతరాల సాకుతో కనెక్షన్ ఇవ్వకుండానే వెనుదిరిగారు. ఎందుకు కనెక్షన్ ఇవ్వలేదో కూడా దరఖాస్తుదారునికి కనీస సమాచారం ఇవ్వలేదు. పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోగా, ఆన్‌లైన్ పోర్టల్‌లో మాత్రం దరఖాస్తును ‘శాశ్వతంగా తిరస్కరించినట్లు’ చూపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై విసిగి వేసారిన బాధితుడు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు.

ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ కుంచం మహేశ్వరరావు ... పిటిషనర్ దరఖాస్తును శాశ్వతంగా తిరస్కరిస్తూ ఈపీడీసీఎల్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను తక్షణమే రద్దు చేస్తూ 2026 జూన్ 22 రిట్ పిటీషన్ నెం. 8103/2026లో తీర్పు వెలువరించారు. విద్యుత్ కనెక్షన్ల వ్యవస్థను క్రమబద్ధీకరించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంధనశాఖకు పలు సూచనలు చేశారు.

రెండు వారాల్లో కనెక్షన్ : పిటిషనర్ పెట్టుకున్న దరఖాస్తును తిరిగి పరిగణనలోకి తీసుకుని, విద్యుత్ చట్టం, 2003 లోని సెక్షన్ 43 ప్రకారం ... ఏవైనా అవసరమైన ఛార్జీలు ఉంటే వాటిని వసూలు చేసి, తగిన రుసుము వసూలు చేసి ఈ తీర్పు కాపీ అందిన రెండు వారాల్లోగా పిటిషనర్ దరఖాస్తును తిరిగి పరిశీలించి కనెక్షన్ మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. 

కారణాలు చెప్పాల్సిందే : స్పష్టమైన కారణాలు తెలపకుండా విద్యుత్ కనెక్షన్ కోసం ప్రజలు పెట్టుకునే దరఖాస్తులను శాశ్వతంగా తిరస్కరించడం ఏమాత్రం సరికాదని కోర్టు తేల్చిచెప్పింది.

నివేదికలు తెప్పించుకోండి : రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలన్నీ ఇకపై సర్వీస్ కనెక్షన్ల దరఖాస్తులు ఎప్పుడు వచ్చాయి ? ఎలాంటి చర్యలు తీసుకున్నారు ? తుది ఫలితం ఏమిటి ? తదితర వివరాలను డిస్కంలు నుంచి రప్పించుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలని ఇంధన శాఖను కోర్టు ఆదేశించింది.  అందుకు అనుగుణంగా విద్యుత్ చట్టం-2003, భారత రాజ్యాంగ లక్ష్యాలు సక్రమంగా అమలయ్యేలా అధికారులకు తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.

ప్రాథమిక హక్కు : ప్రజల దైనందిన జీవితం విద్యుత్‌తో ముడిపడి ఉన్నందున ... విద్యుత్ సదుపాయం ఉండటం భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని, ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు సైతం పేర్కొందని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది.

                అదే విధంగా విద్యుత్ పంపిణీ సంస్ధల పరిధిలోని విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక (సీజీఆరఎఫ్)లు కనెక్షన్లమంజూరుకు సంబంధించి ఇచ్చిన తీర్పులను సైతం రాష్ట్రంలోని కొంతమంది విద్యుత్ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ఇలాంటి వాటిపై కూడా విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శి సమీక్షించాలి. ఇకనైనా అధికారులు మెరుగైన సేవలందించాలి.

ఆర్టీఐ ద్వారా తెలుసుకోవచ్చు :  తీర్పు అమలుపై తీసుకున్న చర్యలు, నివేదికలు కాపీలను సామాజిక కార్యకర్తలు ఆర్టీఐ దరఖాస్తులు సంధించడం ద్వారా పురోగతిని తెలుసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

రెరా వివరాలు ఇవ్వట్లేదా? అయితే ఏజెన్సీల ఆటకట్టించండి!గృహ కొనుగోలుదారులకు ఈడీ కీలక హెచ్చరిక

రెరా వివరాలు ఇవ్వట్లేదా? అయితే ఏజెన్సీల ఆటకట్టించండి!గృహ కొనుగోలుదారులకు ఈడీ కీలక హెచ్చరిక

ప్రతి సామాన్యుడి జీవితంలో సొంతింటి కల ఒక అతిపెద్ద ఆశయం. ఎంతో కష్టపడి కూడబెట్టిన జీవితకాలపు పొదుపును ఆ కల కోసం రియల్ ఎస్టేట్ సంస్థల చేతిలో పోస్తుంటారు. కానీ, కొందరు ప్రమోటర్లు, బడా బిల్డర్లు వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిలువునా ముంచుతున్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ మోసాలకు చెక్ పెట్టి, గృహ కొనుగోలుదారులకు అండగా నిలిచేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలపై సంచలన ప్రకటన చేస్తూ, కొనుగోలుదారులను అప్రమత్తం చేసింది.

54 నిమిషాల క్రితం

రిజిస్ట్రేషన్ శాఖలో పీపీపీ 'ప్రయోగం'

రిజిస్ట్రేషన్ శాఖలో పీపీపీ 'ప్రయోగం'

ముంచుకొస్తున్న ప్రమాదాలు - గాల్లో కలుస్తున్న గోప్యత!

1 రోజుల క్రితం

ఎవిడెన్స్-బేస్డ్ జర్నలిజానికి ‘ఆర్టీఐ’ ఆయుధం!

ఎవిడెన్స్-బేస్డ్ జర్నలిజానికి ‘ఆర్టీఐ’ ఆయుధం!

1 రోజుల క్రితం

చైతన్యమే లక్ష్యంగా kvrbrand.com

చైతన్యమే లక్ష్యంగా kvrbrand.com

హక్కులకై అడుగేయ్ ... వాస్తవాలు అడిగేయ్!

1 రోజుల క్రితం