సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఆశపడే సామాన్యులకు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు (స్ధానిక సంస్ధలు) పరిధిలో భవనాలు నిర్మించే వాళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాల తనిఖీలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ ప్రక్రియలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న జాప్యం, అనవసర అభ్యంతరాలు, అధికారుల వేధింపులకు చెక్ పెట్టేలా ‘త్రీ-టైర్ సిస్టమ’ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై భవనాల తనిఖీ, పరిశీలన, ఆమోద ప్రక్రియను లెవెల్-1, లెవెల్-2, లెవెల్-3 అధికారులకు ప్రభుత్వం పరిమితం చేసింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల పరిధిలో నిర్మించే భవన విస్తీర్ణం, కేటగిరీకు అనుగుణంగా ఈ మూడు స్థాయిల అధికారులను నిర్ణయిస్తూ స్పష్టమైన బాధ్యతలను ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ మార్గదర్శకాలు (సర్క్యులర్ మెమో నెం. ఎంఏయుడీ/2026/001/బిఎల్డిజి-ఐఎన్ఎస్పీ తేది : 1-9-2026) జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి భవన నిర్మాణదారులకు ఏళ్ల తరబడి పట్టిపీడిస్తున్న అవినీతికి అడ్డుకట్ట పడనుంది.
లోడ్ అవుతోంది…







